- అప్పుడే రాష్ట్రానికి ప్రయోజనం
- సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఇదే విషయం చెప్పినట్టు వెల్లడి
- రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రోత్సహించిందే కేసీఆర్ సర్కార్
- రెండున్నరేండ్లలో పెరిగిన మద్యం ఆదాయం రూ. 4 వేల కోట్లే
- స్టేట్‌లో బీర్ల ఉత్పత్తికి నీటి కొరత రానివ్వబోమన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్‌నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి డిండి రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకోవాలని.. అప్పుడే తెలంగాణకు ప్రయోజనమని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్టు పేర్కొన్నారు. మంగళవారం రవీంద్ర భారతిలో మీడియాతో మంత్రి చిట్ చాట్ చేశారు.
కృష్ణా నీటి వినియోగం, డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల అంశంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించినట్టు మంత్రి చెప్పారు. కర్నాటక నుంచి వారం రోజులుగా జూరాల ప్రాజెక్టుకు నీళ్లు వస్తున్నాయన్నారు. 854 అడుగులకు తక్కువగా నీరు ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి నీటిని ఏపీ తీసుకెళ్లడానికి వీలులేకుండా గతంలో తాను స్టే తీసుకువచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
బీఆర్ఎస్ నేతల ఆస్తులపై ఎంక్వైరీ..
బీఆర్ఎస్ నేతల ఆస్తులపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ కొనసాగుతున్నదని, అది పూర్తయ్యాక కమిటీ రిపోర్టు బయటకు వస్తుందని మంత్రి జూపల్లి తెలిపారు. ఖమ్మం – నల్గొండ – వరంగల్, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికలోనూ విజయం కాంగ్రెస్‌దేనని మంత్రి జోస్యం చెప్పారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తామే గెలిచామని గుర్తుచేశారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెప్పిందే తాను అని మంత్రి జూపల్లి అన్నారు.
లిక్కర్ ఉత్పత్తిపై ఎల్‌నినో ఎఫెక్ట్ లేదు
రాష్ట్రంలో ఎల్‌నినో ఎఫెక్ట్ లిక్కర్ఉత్పత్తిపై లేదని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ముఖ్యంగా బీర్ల ఉత్పత్తికి నీటి కొరత రానివ్వబోమని చెప్పారు. ఇందుకోసం శ్రీశైలం నీటి ని సాధ్యమయినంత మేరకు వాడుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో లిక్కల్ సేల్స్ విచ్చలవిడిగా పెంచిందే కేసీఆర్ సర్కార్ అని మంత్రి జూపల్లి అన్నారు. 2014 వరకు రాష్ట్రంలో మద్యం ఆదాయం రూ. 10 వేల కోట్లు ఉంటే.. 2023 డిసెంబర్ నాటికి రూ. 35 వేల కోట్లకు చేరిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4 వేల కోట్లు మాత్రమే పెరిగిందని.. అంటే, 10 శాతం అదనంగా ఆదాయం వస్తున్నదన్నారు. ఫ్యూర్, క్యూర్ తో పాటు సిటీ పరిధిలో 40 వైన్‌షాపులకు కొత్తగా అనుమతులు ఇచ్చామని, కొత్త మద్యం బ్రాండ్ లు మార్కెట్లోకి రావడం అనేది నిరంతరమైన ప్రక్రియ అని మంత్రి చెప్పారు. మద్యం ధరలను మాత్రం పెంచలేదన్నారు. ఇక మద్యంపై ట్యాక్స్ ల విషయంలో పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ట్యాక్స్ లే ఇక్కడ అమలు అవుతున్నాయని మంత్రి చెప్పారు.
